Sharmila Fires on Sarkar

                                            తప్పు మీది..శిక్ష రైతులకా?


కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి
పారిశ్రామిక రంగం కుదేలైంది.. లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు
నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోయాయని రైతుల ఆవేదన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 131, కిలోమీటర్లు: 1,771.5

నాకు ఐదెకరాల భూమి ఉంది. 2 ఎకరాల్లో అలసందలు, మూడెకరాల్లో వేరుశనగ వేశా. పొలంలో రెండు బోర్లున్నాయి. కరెంటు ఉంటే రెండు బోర్లూ 24 గంటలు నీళ్లు పోస్తాయి. కరెంటు లేక పంటంతా ఎండింది. అలసంద చేతికే రాలేదు. వేరుశనగలో అర ఎకరా మిగిలింది. రూ.2 లక్షలు అప్పుల పాలయ్యానమ్మా.. బోర్లలో నీళ్లు ఉన్నా కరెంటు లేక పంటంతా పోయింది..
- వల్లాల నాగేశ్వరరావు, రైతు, కొత్తూరు.


నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశా. చేలో ఒక బోరు, ఒక బావి ఉంది. నీళ్లున్నాయి.. కానీ కరెంటు లేదు. ఇస్తున్న కరెంటు ఏ మూలకూ సరిపోలేదు. తొమ్మిది ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఒక్క ఎకరాకు మాత్రం అరకొరగా నీళ్లు అందాయి.. అందీ అందని నీళ్లకు కంకి గింజ పోయలేదు. తీవ్రంగా నష్టపోయానమ్మా...
- రాజపుత్ర రాజేందర్‌సింగ్, కౌలు రైతు, నేలకొండపల్లి.


మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: జిల్లా ఏదైనా సరే.. కదిలిస్తే చాలు కరెంటు కష్టాలను చెప్పుకుంటూ రైతన్నలు షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. బోర్లు, బావుల్లో నీరున్నా విద్యుత్ లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం గురువారం ఖమ్మం జిల్లా పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో సాగింది. పాదయాత్రలో రైతులు ఎండిపోయిన పంటలను, పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను చూపించి తమ బాధలు చెప్పుకున్నారు. ముదిగొండ మండల కేంద్రం శివారులోని పారిశ్రామికవాడలో రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొని, గ్రానైట్ పరిశ్రమ యజమానుల సమస్యలు విన్నారు. అధైర్యపడవద్దని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఈ పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు..

రాష్ట్రంలో ఎన్ని జల విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ థర్మల్ విద్యుత్తు నుంచి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.. ఏ సీజన్‌లో ఎంత విద్యుత్తు వినియోగం అవుతుంది.. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఎంత కరెంటును ఉత్పత్తి చేస్తున్నాయి.. ఇంకా ఎంత అవసరం అన్న విషయాలను వైఎస్సార్ వేళ్ల మీద లెక్కలు వేసి చెప్పేవారు. కానీ ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ప్రస్తుత పాలకులు చేసిన తప్పులకు ఈరోజు రైతులు, ప్రజలు, పారిశ్రామిక వేత్తలు శిక్షలు అనుభవిస్తున్నారు. వైఎస్సార్ ప్రతి వర్గానికీ సేవలు చేశారు కాబట్టే కులమతాలకు అతీతంగా ప్రజలు ఆయన్ను ఇంతలా గుర్తుపెట్టుకున్నారు. ఒక్క రూపాయి చార్జీ పెంచినా రైతులు, పేదలపై భారం పడుతుందని ఆలోచన చేశారు. గ్రానైట్ పరిశ్రమను నిలబెట్టడానికి వైఎస్సార్... రాయల్టీలో సబ్సిడీ ఇచ్చారు. కరెంటు బిల్లు యూనిట్ ధరలో సబ్సిడీ ఇచ్చారు.

గుజరాత్‌ను మించేలా గ్రానైట్ పరిశ్రమ..: కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో కరెంటు సంక్షోభంతో వేల పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తాకుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రానైట్ పరిశ్రమకు చేయాల్సిన మేలు అంతా చేస్తారు. కరెంటు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీల విషయంలో గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. కార్మికులకు ఉపాధి కల్పించ డం, వారికి ఇళ్లు, తెల్లరేషన్ కార్డులు, వారి పిల్లల చదువుల విషయంలో అండగా ఉంటుంది. గుజరాత్‌ను మించేటట్టు ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమను జగనన్న తీర్చిదిద్దుతారు.

గురువారం 131వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం గోకినేపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి వెంకటాపురం, ముదిగొండ, సూర్యపేట క్రాస్ రోడ్డు, ఖమ్మం శివారులోని ఆటోనగర్ మీదుగా సాగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. గురువారం 13.7 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1771.5 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, మెండెం జయరాజ్ ఉన్నారు. ప్రతిరోజూ షర్మిల వెంట నడుస్తున్న వారిలో వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, దవళ వెంకటగిరి బాబు తదితరులున్నారు.

ఇలాగైతే గ్రానైట్ పరిశ్రమ మూతే

ఈయన పేరు సాధు రమేష్ రెడ్డి. చిన్న తరహా గ్రానైట్ కంపెనీ యజమాని. ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యం అసోషియేషన్ అధ్యక్షుడు. ఈయనకు రెండు గ్రానైట్ కట్టర్ యానిట్లు ఉన్నాయి. గతంలో ఒక యూనిట్‌లో 40 మంది కార్మికులు పనిచేసేవాళ్లు. నెలకు 30 వేల స్క్వేర్ యూనిట్ల గ్రానైట్ రాళ్లను కత్తిరించి ఉత్పత్తి చేసేవాళ్లు. ఇప్పుడు అడ్డగోలు కరెంటు కోతల నేపథ్యంలో నెలకు కేవలం 8 వేల స్క్వేర్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పని లేకపోవడంతో 32 మంది కార్మికులు మానేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే గ్రానైట్ పరిశ్రమ మూతపడిపోతుందని షర్మిల వద్ద రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.