Congress -TDP Rebal MLAs wrote a letter to Speaker@ysrcpsakshi.blogspot.in

స్పీకర్‌కు కాంగ్రెస్, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ
ప్రజల ఆకాంక్షల మేరకే పార్టీలతో విభేదించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాం
జనం తరఫున పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌తో చేయి కలిపాం
మా సభ్యత్వాలను రద్దు చేసి, తక్షణమే ఖాళీ అయ్యే స్థానాలను నోటిఫై చేయండి
మా పదవులు పోవాలి, కానీ ఎన్నికలు రాకూడదు.. ఇదే కాంగ్రెస్, టీడీపీల కుట్ర 
స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గరన్న ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి 

 హైదరాబాద్:అవిశ్వాస తీర్మాన సమయంలో తమ పార్టీలతో విభేదించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందున తమ శాసనసభ్యత్వాలను రద్దు చేసి, ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు బహిరంగ లేఖ రాశారు. క రెంట్ కోతలు, చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా నిరవధిక దీక్షలో పాల్గొంటున్న ఆ ఎమ్మెల్యేలు శుక్రవారం దీక్షా వేదిక వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము స్పీకర్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. 

‘ఈ ప్రభుత్వంపై ప్రజలందరి సాక్షిగా, శాసనసభ సాక్షిగా మా పార్టీలతో విభేదించాం. ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌తో చేయి కలిపాం. మా శాసనసభ్యత్వాలను తక్షణమే వదులుకునేందుకు సిద్ధపడ్డాం. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం మాకు జుగుప్స కలిగిస్తోంది. మా శాసనసభ సభ్యత్వాలు పోవాలి కానీ మళ్లీ ఎన్నికలు జరగరాదన్న కుట్రపూరిత రాజకీయ వ్యూహాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం అమలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. మా సభ్యత్వాల ర ద్దును తక్షణమే ప్రకటించడంతో పాటు తద్వారా ఖాళీ అయ్యే స్థానాలను నోటిఫై చేయాలని కోరుతున్నాం. ఆ శాసనసభ స్థానాలకు సెక్షన్ 151 (ఏ) ప్రకారం ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నాం..’’ అని ఆ లేఖలో స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. 

సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు (బొబ్బిలి), జోగి రమేష్ (పెడన), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), పేర్ని నాని (మచిలీపట్నం), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ సిటీ), ఎం.రాజేష్‌కుమార్ (చింతలపూడి), బి.శివప్రసాద్‌రెడ్డి (దర్శి), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), తెలుగుదేశం ఎమ్మెల్యేలు టి.వనిత (గోపాలపురం), ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లి), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), పి.సాయిరాజ్ (ఇచ్ఛాపురం), ఎన్.అమరనాథ్‌రెడ్డి (పలమనేరు) స్పీకర్‌కు రాసిన లేఖలో సంతకాలు చేశారు. తామంతా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని.. పదవులు పోతాయని తెలిసినా ప్రజల తర పున నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామని పేర్కొన్నారు. మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అరకొరగా కరెంట్ సరఫరా చేస్తూనే ఇంత అడ్డగోలుగా చార్జీలు పెంచగలుగుతోందంటే.. అందుకు కారణం చంద్రబాబు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమేనని దుయ్యబట్టారు. ఐఎంజీ, ఎమ్మార్ కేసులలో తనపై విచారణ జరగకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై అవిశ్వాసం సమయంలో ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వల్లే ప్రభుత్వం ఇంతకు తెగించిందని విమర్శించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు మమ్మల్ని అనర్హుల్ని చేయాలి కానీ.. ఎన్నికలు రాకూడదని నీతిమాలిన డ్రామాలకు తెరలేపుతున్నాయని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వరకూ అనర్హత ప్రకటించకపోతే.. ఇక ఎన్నికలు నిర్వహించనక్కర్లేదన్నది ఆ రెండు పార్టీల దురాలోచన అని తూర్పారపట్టారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఏ పార్టీకి చెందని వారని, ఎవరి ఒత్తిడులకు లొంగరన్న ఉద్దేశంతో తాము ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్టు విలేకరుల సమావేశంలో జోగి రమేష్ తెలిపారు.

ఎన్నికలు జరిపితే ఎవరు కరెక్టో తేలిపోతుంది..: ఎన్నికలకు తాము సిద్ధమని, కాంగ్రెస్, టీడీపీ సిద్ధమేనా అని ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పోటీ చేయడానికి మేం సిద్ధం. కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేసినా, ఉమ్మడిగా పోటీ చేసినా ప్రజా క్షేత్రంలో వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ధైర్యం, ప్రజలపై నమ్మకం ఉంటే ఎన్నికలు జరిపించండి. మీ బలం ఏంటో, జగన్ శక్తి ఎంతో తేలిపోతుంది’’ అని సవాల్ చేశారు. తమ నియోజకవర్గ ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపుతున్న కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ పదవులు పోతాయని తెలిసీ ప్రజల కోసం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు తెలిపి ఉంటే ఈ ప్రభుతం విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం వేసే అవకాశం ఉండేదే కాదన్నారు. చార్జీల పెంపులో చంద్రబాబుదే ఎక్కువ బాధ్యత అని స్పష్టంచేశారు. ఎన్నికలు జరిపితే ప్రజాక్షేత్రంలో ఎవరు కరెక్టో తేలుతుందన్నారు. 
Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.