ఎవరికీభిక్షం? ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీల ప్రకటనపై విజయమ్మ ఆగ్రహం

పెంచిన చార్జీలు తగ్గించేదాకా దీక్ష ఆపే ప్రసక్తే లేదు..
రూ.6344 కోట్లు పెంచి..రూ.830 కోట్లు తగ్గిస్తారా?
200 యూనిట్లు దాటి వాడేవారంతా క్యాపిటలిస్టుల్లా కనిపిస్తున్నారా?
రైతులకు 3 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు.. దానిపై మాట్లాడరేం?
మూతపడిన పరిశ్రమలపైనా నోరెత్తలేదు
మా పోరాటం ఆగదు.. బంద్ యథావిధిగా జరుగుతుంది

సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్ర ప్రజలపై రూ.6,344 కోట్ల మేర విద్యుత్ చార్జీల భారం వేసి 830 కోట్ల రూపాయలు తగ్గిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్తున్నారని, ఆయన ఎవరికి భిక్షం పడేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు కొంతమేర తగ్గించినట్లు గురువారం ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్దిసేపటికి రాత్రి 9 గంటలకు ఆమె కరెంటు సత్యాగ్రహ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులతో సమావేశమై విద్యుత్ చార్జీలను సమీక్షించిన ముఖ్యమంత్రి ఇంకా ఏమో చెబుతారని అనుకున్నామని, కానీ ఆయన ప్రకటన ఏ మాత్రం హర్షణీయంగా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ముందు 6,344 కోట్ల రూపాయల భారం వేయాల్సిందిగా తానెక్కడ చెప్పానని ముఖ్యమంత్రి అనడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.

వారు క్యాపిటలిస్టులా: 150 నుంచి 200 యూనిట్లు వాడుకునే విద్యుత్ గృహ వినియోగదారులు కాక మిగతా వారందరినీ క్యాపిటలిస్టులుగా(పెట్టుబడిదారులు) ముఖ్యమంత్రి పేర్కొనడం గర్హనీయమని విజయమ్మ అన్నారు. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు నడుపుకునే వారిని కూడా క్యాపిటలిస్టులు అన్నారంటే ఏమనాలో తెలియడం లేదన్నారు. రైతులకు పల్లెల్లో రెండు మూడు గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వడం లేదని, దాని గురించి ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూత పడ్డాయని, వాటి గురించి ఒక్క మాటా చెప్పలేదన్నారు. అంతవరకు దీక్ష ఆగదు: పెంచిన విద్యుత్ చార్జీలను మొత్తంగా తగ్గించాలనేది తమ పార్టీ డిమాండ్ అనీ, అప్పటి వరకూ తాము చేస్తున్న దీక్ష కొనసాగుతుందని విజయమ్మ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన విధంగా శుక్రవారం నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమం, 9న బంద్ యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆమె కోరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆనాటి పరిస్థితులే ఉన్నందున దానికి గుర్తుగా 9న నిర్వహిస్తున్న బంద్‌లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున వైఎస్ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి కార్యకర్తలు కనీసం రెండు కిలోమీటర్లు పాదయాత్రలు చేసి బంద్ నిర్వహించాలని పేరు పేరునా కోరుతున్నానని అన్నారు.

ప్రజలే బుద్ధి చెప్తారు: సీఎం ప్రకటనకు ముందు దీక్షా శిబిరం వద్ద విజయమ్మ.. మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం దిగిరాకపోతే విద్యుత్ చార్జీల అంశంపై తమ ఆందోళన ప్రజా క్షేత్రంలోకి వెళుతుందని చెప్పారు. ఇది మోయలేని భారం కనుక తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ప్రజల పక్షాన తమ పార్టీ కూడా అదే కోరుకుంటోందని తెలిపారు. అందరి అభిమతానికి భిన్నంగా ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ప్రజలు పాలకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పది సార్లు పెంచి ఒక్క సారి తగ్గించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలాది కోట్ల రూపాయల కరెంటు చార్జీల భారం వేసి వంద లేదా రెండు వందల కోట్ల రూపాయలు తగ్గిస్తామంటే సహించేది లేదని విజయమ్మ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ఏకపక్షంగా ఉందని కాంగ్రెస్ వారే కొందరు చె బుతూ ఇది మంచిది కాదనే అభిప్రాయంతో ఉన్నారని, వారంతా తమ మాదిరిగా ఆందోళన చేస్తే బాగుంటుందని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుగానీ, కాంగ్రెస్‌గానీ వైఎస్‌ను టార్గెట్ చేసి మాట్లాడటమే వారి పనిగా ఉందే తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టవని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

టీడీపీకి అర్హత లేదు: బషీర్ బాగ్ ఉదంతంలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న టీడీపీకి కరెంటు ఉద్యమం చేసే నైతిక అర్హత అసలు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు అసెంబ్లీలో ప్రభుత్వానికి మద్దతునిచ్చి బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికే టీడీపీ ఆందోళన చేస్తోందన్నారు. తక్కువ ధరకు బొగ్గు లభిస్తున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రభుత్వాన్ని టీడీపీ ఎందుకు ప్రశ్నించదని ఆమె అన్నారు. గ్యాస్ లభ్యమవుతున్న ధర కన్నా ఎక్కువ ధరకు కొంటున్నా ఎందుకు టీడీపీ కిమ్మనడం లేదన్నారు.

ఆదాయం పెరిగినా సబ్సిడీ ఇవ్వరా?: సోమయాజులు

రాష్ట్ర ఆర్థిక ఆదాయ వనరులు రూ.43 వేల కోట్లు పెరిగినా విద్యుత్ రంగానికి అదనంగా ఇచ్చే సబ్సిడీ రూ. 200 కోట్లేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు ధ్వజమెత్తారు. సత్యాగ్రహం దీక్షా శిబిరం వద్ద ఆయన కొణతాల రామకృష్ణతో కలిసి మీడి యాతో మాట్లాడారు. గత మూడేళ్లుగా రాష్ర్ట ప్రభుత్వం ఇంధన సర్‌చార్జి రూపంలో ప్రజలపై రూ.18 వేల కోట్ల భారం వేసిందని, మొత్తం రూ.30 వేల కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేశారని చెప్పారు. 2013-14 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు తేడా వస్తుందని చెప్పి, అందులో రూ.6,500 కోట్ల భారం ప్రజలపై వేయాలని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు ప్రభుత్వం సూచించిందని విమర్శించారు. గత ఏడాది విద్యుత్ రంగానికి ఇచ్చిన సబ్సిడీ రూ.6,045 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.5,450 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇపుడు తగ్గిస్తామంటున్న రూ.830 కోట్లు కలిపినా ఆ సబ్సిడీ రూ.6,200 కోట్లు దాటడం లేదన్నారు.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.