Press Councill Of India Fires on Andrajyoti, Yellow Journalism....


- మహిళల గురించి రాసేటప్పుడయినా వివరణ తీసుకోరా?
- ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగ్రహం
- మీ లెసైన్స్ రద్దు చేయాలని ఆర్‌ఎన్‌ఐని కోరతాం
- డబ్బునే గౌరవిస్తున్నారని చైర్మన్ కట్జూ వ్యాఖ్య
- క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు
- వివరణలు ప్రచురించని ‘ఈనాడు’కూ అక్షింతలు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివరణను ప్రచురించాలని ‘ఈనాడు’కు ఆదేశం
 హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మండిపడింది. ఆ పత్రికలో వస్తున్న వార్తలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను అప్రతిష్టపాలుచేసే విధంగా ఉన్నాయని, సర్క్యులేషన్ పెంచుకునేందుకు సంచలనాలు సృష్టించాలన్న ఆలోచనతో పదేపదే అపరాధిగా మారుతోందని కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలోని పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అందిన ఫిర్యాదులపై కట్జూ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం జూబ్లీహాల్‌లో విచారణ జరిపింది. హోమ్‌సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కామేశ్వరి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా కట్జూ ఆంధ్రజ్యోతి వ్యవహారశైలిని ఆక్షేపించారు.

‘‘ఈ దేశంలో కొన్ని పత్రికలు సర్క్యులేషన్, సంచలనాల కోసం ప్రజలను, మహిళలను ఎలా అప్రతిష్టపాలు చేస్తున్నాయనేందుకు ఈ కేసు ఒక ఉదాహరణ. ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయి. ఆంధ్రజ్యోతిపై క్రిమినల్ కేసు నమోదుకు సంబంధిత కోర్టును ఆదేశిస్తున్నా. పోలీసులు కూడా విచారణ జరపాలి. పత్రిక లెసైన్స్‌ను రద్దు చేయాలని రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్‌ఎన్‌ఐ)కు సిఫారసు పంపుతాం... ’’ అని పేర్కొన్నారు. కమిటీ విచారణ జరిపిన 19 ఫిర్యాదుల్లో ఆరు ఆంధ్రజ్యోతి పత్రికపైనే రావడంతో కమిటీ సభ్యులు కూడా ‘‘అన్నీ ఆంధ్రజ్యోతిపైనేనా? ఆ పత్రిక జర్నలిజం నైతిక విలువలను ఉల్లంఘిస్తోంది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీవీవీ రామకృష్ణాచార్యులు, డాక్టర్ ఎ.గాయత్రీదేవిల ఫిర్యాదును పరి శీలించిన కట్జూ స్పందిస్తూ ‘‘ఏ ఆధారాలూ లేకుండా ప్రజలను అప్రతిష్టపాలు చేస్తారా?’’ అని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

ప్రకటనలు ఇవ్వొద్దని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)కి సిఫారసు చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన ఫిర్యాదుపై విచారిస్తూ.... షోకాజ్ నోటీసుకు వివరణ ఎందుకు ఇవ్వలేదని ఆంధ్రజ్యోతి న్యాయవాదిని కట్జూ ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ, తమ ఎడిటర్ విదేశాల్లో ఉన్నందున కౌంటర్ వేయలేకపోయామని చెప్పారు. ‘‘మాకు వివరణలు చెప్పొద్దు. మేం దానికి అనుమతించం. అయినా మేము 11 నెలల క్రితం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడానికి, మీ ఎడిటర్ వారం క్రితం విదేశాలకు వెళ్లడానికి సంబంధం ఏమిటి?’’ అని కమిటీ సభ్యులు నిలదీశారు.

వివరణ ప్రచురించాల్సిన బాధ్యత లేదా?
‘‘విచారణ సంస్థ చేస్తున్న దర్యాప్తు గురించి రాస్తూ... ఫలానా కేసులో ఫలానా వారిని ప్రశ్నిస్తారని ఒకసారి, ప్రశ్నించరని మరోసారి రాయడం ఎందుకు?’’ అని ఈనాడు పత్రిక యాజమాన్యాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. ఓఎంసీ కేసులో కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీబీఐ ప్రశ్నిస్తుందని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించిందని, తమ పార్టీ అధ్యక్షుడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఆ కథనంపై వివరణ ప్రచురించాలని ఆ పత్రిక యాజమాన్యాన్ని కోరినా ప్రచురించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీఎన్‌వీ ప్రసాద్ చేసిన ఫిర్యాదును ప్రెస్ కౌన్సిల్ విచారించింది.

ఈ సందర్భంగా ఈనాడు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని రాశామని, ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అన్నారు. ఈ వాదనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది శ్రీరాం విభేదించారు. ఆ కథనంలో పదేపదే కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి అని రాశారని, ఎంపీ అంటే రాజకీయాలకు సంబంధం ఎందుకు ఉండదని, అందునా ఆయన పార్టీ అధ్యక్షుడని కౌన్సిల్ కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడొకరు మాట్లాడుతూ... వివరణ ఇచ్చినప్పుడు ప్రచురించాల్సిన బాధ్యత లేదా? అని ఈనాడు న్యాయవాదిని ప్రశ్నించారు. ‘‘మీరు రాసిన వార్త జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసింది కదా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇంతకీ మీరు రాసిన వార్త నిజమేనని రుజువైందా?’’ అని మరో సభ్యుడు ప్రశ్నించగా, లేదని ఈనాడు న్యాయవాది ఒప్పుకున్నారు.

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో వివరణ పంపాలని, దాన్ని ‘ఈనాడు’ తప్పనిసరిగా ప్రచురించాలని కమిటీ ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వంపై దినభూమి ఎడిటర్ ఫిర్యాదును జస్టిస్ కట్జూ విచారిస్తూ ‘30 మంది పోలీసులు రాత్రిపూట గోడదూకి ఇంట్లోకి వెళ్లి ఫిర్యాదుదారుడిని అరెస్టు చేస్తారా? వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? చార్జిషీటు వేసి జైలుకెందుకు పంపలేదు? అలా పంపలేకపోతే రాజీనామా చేయండి’ అని తమిళనాడు ప్రభుత్వం వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంతరం కట్జూ మాట్లాడుతూ జర్నలిస్టులకు కనీస విద్యార్హతపై ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు శ్రవణ్‌గార్గ్ నేతృత్వంలోని కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనుందని, దీన్ని పూర్తిస్థాయి ప్రెస్‌కౌన్సిల్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలని అభిప్రాయపడ్డారు.

Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.