2-07-2013:
నేటినుంచి విజయమ్మ ఆమరణ దీక్ష
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష.. పాల్గొననున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనల బాట
రాష్ట్రంలో చంద్రబాబు-2 పాలన సాగుతోంది: కొణతాల
నిరసనలతో కదంతొక్కిన వామపక్షాలు.. ప్రభుత్వ తీరుపై నిప్పులు
సర్కారుకు చావేనన్న కిషన్‌రెడ్డి.. మూడో రోజుకు ఆమరణ దీక్షరాష్ట్ర ప్రజల ఆగ్రహావేశాలను ప్రతిఫలిస్తూ కరెంటు పోరు క్రమంగా పదునెక్కుతోంది. చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు తమ ఆందోళనను రోజురోజుకూ ఉధృతం చేస్తున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సన్నద్ధమవుతున్నారు. దీంతో కరెంట్ ఉద్యమం పతాకస్థాయికి చేరుకోనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. ఉదయం తొమ్మిదింటికి పంజాగుట్టలోని దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి, బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం విజయమ్మ ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ చేరుకుని ఆమరణ దీక్ష ప్రారంభిస్తారు. అందుకు ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతోపాటు వైఎస్సార్‌సీపీ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. మరోవైపు విపక్షాల కరెంటు ఉద్యమాలు సోమవారం మరింతగా జోరందుకున్నాయి. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో 10 వామపక్ష పార్టీలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపాయి.
‘ఇది ఆరంభం మాత్రమే. ప్రజా ఉద్యమాలతో తడాఖా చూపుతాం. ఏప్రిల్ 9న జరిపే బంద్‌తో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాం’ అని హెచ్చరించాయి. చార్జీల పెంపుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. చార్జీల పెంపును తక్షణం ఉపసంహరించాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఐదేళ్ల దాకా కరెంటు చార్జీల భారం ఉండబోదని 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే.. ఆ ఎజెండాతోనే గద్దెనెక్కిన ప్రభుత్వం, ఆయన మరణానంతరం దాన్ని తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టారు. కరెంటు షాకులతో ప్రజలను పీడించిన చంద్రబాబు హయాంకు కొనసాగింపుగా ప్రస్తుతం రాష్ట్రంలో బాబు-2 పాలన సాగుతోందంటూ వైఎస్సార్‌సీపీ నేత కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్‌ను అటకెక్కించజూడటమంటే నిప్పుతో చెలగాటమేనని హెచ్చరించారు. ఉచిత విద్యుత్ కొనసాగింపు, చార్జీల పెంపు ఉపసంహరణ కోసం వైఎస్సార్‌సీపీ ఎంతవరకైనా పోరాడుతుందని ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో అన్ని వర్గాలు, రంగాలపై నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం విజయమ్మ దీక్ష చేపట్టనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇందులో పాల్గొంటారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మెడలు వంచేందుకే ఆమె దీక్ష చేపడుతున్నారని పీఏసీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ తెలిపారు. భేటీ అనంతరం పీఏసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘విజయమ్మ మంగళవారం ఉదయం తన నివాసం నుంచి బయల్దేరి పంజాగుట్ట వద్దనున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి దీక్షాస్థలికి చేరుకుని దీక్ష చేపడతారు’’ అని వివరించారు. ‘గతంలో ప్రకటించిన మాదిరిగా ఏప్రిల్ 3 నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఐదో తేదీ నుంచి ప్రజా బ్యాలెట్ ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
సర్కారు తీరు... నీరో చందం
రాష్ట్రంలో నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా ఉందంటూ కొణతాల దుయ్యబట్టారు. ‘‘కిరణ్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం అంధకారంలోకి జారుకుంటోంది. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి, కేవలం అధికారం నిలుపుకోవడమే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తాను మొండివాడినని కిర ణ్ పదేపదే తనకు తాను కితాబిచ్చుకుంటారు. మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ వాటాను ఎందుకు తేలేకపోతున్నారు? ఆ మొండితనంతో రాష్ట్ర అభివృద్ధి, గ్యాస్ కేటాయింపులపై ఎందుకు పోరాడటం లేదు? కేంద్రానికి కిరణ్ దాసోహమయ్యారు. వారి చెప్పు కింద పని చేస్తున్నారు.
వారు ఆడించినట్టల్లా ఆడుతూ తందాన అంటున్నారు’’ అని నిప్పులు చెరిగారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎత్తేస్తే నిప్పుతో చెలగాటమాడినట్టే అవుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంత వరకైనా పోరాడుతుందని ప్రకటించారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ నేతలు దొంగ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ‘‘విద్యుత్ భారం పేదలపై పడకూడదని, ప్రభుత్వమే భరించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటారు. దీనిపై ఆజాద్‌కు లేఖ రాశానని చిరంజీవి చెబుతారు. వీరికి చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున వెంటనే సోనియాతో మాట్లాడి రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులు తేవచ్చుగా’’ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో చంద్రబాబు-2 పాలన!!
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు-2 పాలన కొనసాగుతోందని కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. ‘‘1995 నుంచి 2004 వరకు సాగిన బాబు పాలన రాష్ట్ర చరిత్రలో పీడకలగా మిగిలిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. బాబు పాలన పార్ట్-1 అయితే కిరణ్ హయాం పార్ట్-2 గా చరిత్రకెక్కినుంది’’ అంటూ కొణతాల ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించకుండా కాలయాపన చేశారని విమర్శించారు. ‘‘బాబు నిర్లక్ష్యం వల్లే ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టుల ఎత్తు పెంచుకున్నాయి. అక్రమ నిర్మాణాలు జరిపాయి. కేజీ బేసిన్ గ్యాస్ విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వాటిని రిలయన్స్‌కు బాబు కట్టబెట్టారు. నేటి కరెంటు కష్టాలకు వారి అమర్థతే కారణం. ప్రజలపై కిరణ్ ప్రభుత్వం మోపిన రూ.6,500 కోట్ల కరెంటు చార్జీల పెంపునకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా నైతిక బాధ్యత వహించాలి. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతిచ్చినా, తానే అవిశ్వాసం పెట్టినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పడిపోయేది. ప్రజలకు భారం తప్పేదన్నారు. అవిశ్వాసమప్పుడు అధికార కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా సహకరించిన బాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ప్రజాపక్షం వహించి చార్జీల పెంపుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ నిరసన తెలపడంతో పాటు అవిశ్వాసంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిందని గుర్తు చేశారు.
సత్యాగ్రహానికి ఏర్పాట్లు పూర్తి
విజయమ్మ నిరాహార దీక్షకు ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొణతాలతో పాటు పార్టీ నేతలు సోమయాజులు, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు వాటిని పరిశీలించారు. సామాన్యులపై మోయలేని భారం వేసిన ప్రభుత్వం మెడలు వంచేందుకే ఈ పోరాటమని జిట్టా చెప్పారు. బాబు, కిరణ్‌ల పాలన మధ్య ఏ మాత్రం తేడా లేదన్నారు. తమ పోరాటం ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. పార్టీ నేతలు హెచ్.ఏ.రెహ్మాన్, పుత్తా ప్రతాపరెడ్డి, ఆదం విజయకుమార్ తదితరులు దీక్ష ఏర్పాట్లను పరిశీలించారు.
No comments:
Post a Comment