Maroprajaprastanam at Krishna District

షర్మిల పాదయాత్ర.. జైత్రయాత్రను తలపిస్తోంది.. జగనన్న సంధించిన బాణంగా ఆమె జనం గుండెల్లోకి దూసుకుపోతోంది.. వారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.. తమ కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆవేదనలు తెలుసుకుంటూ.. ఓదార్చుతూ.. ఈ బాధలు ఇంకెన్నాళ్లో ఉండబోవంటూ భరోసానిస్తున్న ఆమెకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రజాకంటక పాలనకు ఇక చరమగీతం పాడినట్లేనన్న విజయోత్సాహం పొంగిపొర్లేలా ఆమె వెంట సైనికులై కదంతొక్కుతున్నారు. 



 పెడన/గుడ్లవల్లేరు : షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ఊరూవాడా కదిలివస్తోంది. చిన్నాపెద్దా, ఆడామగా వెంట నడుస్తున్నారు. రాజన్నను తలపిస్తూ.. జగనన్న వాణిని వినిపిస్తూ ఆమె ముందుకు సాగుతుంటే జనం తమ కష్టాలు గట్టెక్కుతాయన్న భరోసాతో యాత్ర వెంట పరుగులు పెడుతున్నారు. పింఛను రాక వేదన చెందుతున్న వృద్ధుల్ని, ఆరోగ్య శ్రీ సేవలందక ఆందోళన చెందుతున్న అభాగ్యుల్ని, ఉపాధి లేక ఆవేదనకు గురవుతున్న కూలీల్ని, ఫీజురీయింబర్స్ మెంట్ అందక చదువు సాగేదెలా అని దిగులుగా ఉన్న విద్యార్థుల్ని, నిరుద్యోగం సతమతమవుతున్న యువతను, ఈ నెల ఇల్లు గడపడమెలా అని దిగాలుగా ఉన్న మహిళల్ని, వెన్ను విరిగే కష్టనష్టాలతో కుంగిపోతున్న రైతన్నను పలకరిస్తూ.. వారి మనసుకు ఊరటనిస్తూ.. భవితమనదేనంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలపిస్తోంది. ఆనాడు ప్రజా ప్రస్థానంలో రాజన్న ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకున్నారో.. ఈ మరో ప్రజా ప్రస్థానంలోనూ ఆయన బిడ్డ చెబుతున్న మాటను అలాగే అమలుచేస్తారని జనం విశ్వసిస్తున్నారు. తమ బతుకుల్లో సరికొత్త వెలుగులు అతిత్వరలోనే వస్తాయంటూ ఈ పాదయాత్రను జైత్రయాత్రలా మార్చేస్తున్నారు.

జిల్లాలో షర్మిల పాదయాత్ర గురువారం పెడన నియోజకవర్గం నుంచి గుడివాడ సెగ్మెంటులోని గుడ్లవల్లేరు వరకు సాగింది. మండే ఎండను సైతం లెక్కచేయకుండా ఆమె ముందుకు కదులుతుంటే.. జనం కూడా అంతే ఓపికగా ఆమె రాక కోసం నిరీక్షిస్తూ స్వాగతం పలికారు. షర్మిలను చూసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు యువత, మహిళలు పోటీపడ్డారు. 

స్థానిక సమస్యల ఏకరువు
యాత్రలో భాగంగా వడ్లమన్నాడు గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో మహిళలు, వృద్ధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. మంచినీటి కొరత, కరెంటు కోత, కరెంటు బిల్లుల మోత, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్యల గురించి పలువురు షర్మిలకు వివరించారు. దారిలో వేమవరం వద్ద కొండలమ్మ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అర్చకులు పూజలు చేసి షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని దీవించారు. గుడ్లవల్లేరులోని వైఎస్ వారధిపై ఉన్న రాజన్న విగ్రహానికి పూలమాల వేసి ఆమె అంజలి ఘటించారు. గుడ్లవల్లేరులో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ రాజన్న రాజ్యం తెచ్చేందుకు జగనన్న చేస్తున్న ప్రయత్నానికి మనమంతా అండగా నిలవాలని కోరారు.

పెడన నేతల ఆత్మీయ వీడ్కోలు.. కొడాలి నాని ఘన స్వాగతం
పెడన నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తిచేసుకుని గుడివాడ నియోజకవర్గంవైపు కదిలిన మరోప్రజాప్రస్థానం యాత్రకు పెడన నేతలు ఆత్మీయ వీడ్కోలు పలకగా, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఘన స్వాగతం పలికారు. పెడన నియోజకవర్గ కో ఆర్డినేటర్లు వాకా వాసుదేవరావు, ఉప్పాల రామ్‌ప్రసాద్‌లు పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల ముఖ్యనేతలను నడుపూరు గ్రామంలో బస చేసిన షర్మిలకు పరిచయం చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన పాదయాత్రకు కొద్ది దూరంలోనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తన అనుచరులు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్‌కు చెందిన రాజస్థాన్ తీన్‌మార్‌పార్టీ, గుడ్లవల్లేరు, కుచ్చికాయలపూడి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక డప్పుల దళంతో పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. దారిపొడవున పూలవర్షం, బాణాసంచా కాల్పులతో సందడిగా మారింది. పెడన నియోజకవర్గంలోని నడుపూరు నుంచి మొదలైన పాదయాత్ర రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, పద్మాలపాలెం, బలరాంపురం, కౌతవరం, గుడ్లవల్లేరు, కూరాడ వరకు సాగింది.

షర్మిలతో నడిచిన లక్ష్మీపార్వతి
షర్మిలను ఎన్టీఆర్ సతీమణి నందమూరు లక్ష్మీపార్వతి కలిశారు. కొద్ది దూరం ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ పరిశీలకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర లీగల్‌సెల్ కో ఆర్డినేటర్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు(సీఎన్ రావు), పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పెడన నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ఉప్పాల రామ్‌ప్రసాద్, వాకా వాసుదేవరావు, వైఎస్సార్ సేవాదళ్ కన్వీనర్ మావులేటి వెంకట్రాజు, తిరువూరు కో ఆర్డినేటర్ వల్లభాయ్, కైకలూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేజండ్ల శివశంకరరావు, ఉప్పాల రాము, గొరిపర్తి రవికుమార్, తుమ్మా శ్రీనివాసరావు, మండలి హనుమంతరావు, డాక్టర్ కొసరాజు వెంకట్రాది చౌదరి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు



Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.