నల్లపాడు (గుంటూరు జిల్లా), 14 మార్చి 2013: చంద్రబాబు నాయుడు ఏ పక్షంలో ఉన్నారని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఆయన ప్రతిపక్షంలోనా లేక పాలకపక్షంలో ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు కళ్ళకు గంతలు కట్టుకున్నారా? అని ఎద్దేవా చేశారు. కిరణ్ ప్రభుత్వం తీరుకు ఒక వైపున ఇతర పక్షాలన్నీ అవిశ్వాసం పెడుతుంటే ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పారిపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు చంద్రబాబు నాయుడు ఏ పక్షానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా గురువారం రాత్రి గుంటూరు జిల్లాలోని నల్లపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె చంద్రబాబును కడిగిపారేశారు. అవిశ్వాసం ఆయన ఎందుకు పెట్టరని నిలదీశారు.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు అప్పుల బాధ నుంచి విముక్తి పొందారని, ప్రస్తుత ప్రభుత్వం తీరుతో వారంతా మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోయారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు కట్టేందుకు రైతులు ఇంటిలోని వస్తువులు, ఒంటిలోని కిడ్నీలను అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆమె విచారం వ్యక్తంచేశారు. ఇప్పుడు ఎరువుల ధరలు 4 రెట్లు పెరిగిపోయాయన్నారు. రాజన్న హయాంలో ధరలు, చార్జీలు పెంచలేదని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ అమలు చేశారని, లక్షలాది మంది విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్సుమెంటు ఇచ్చారని గుర్తుచేశారు. మహానేత బ్రతికి ఉంటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఉండే వారన్నారు. ఈ ప్రభుత్వం 3 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడంలేదని ఆరోపించారు. పైగా వీళ్ళిచ్చే బోడి మూడు గంటల విద్యుత్‌కు రెట్టింపు బిల్లులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం ఉంటేనేం.. చస్తేనేం.. అని ప్రజలు అంటున్నారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ముక్తకంఠంతో ఈ ప్రభుత్వాన్ని దించేయమని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. తాము అవిశ్వాసం పెడితే ఇతర పక్షాలు లాభపడతాయని చంద్రబాబు చెబుతున్న మాటల్లో పసలేదన్నారు. చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు, చేసేవి స్వార్థ రాజకీయాలు అన్నారు. చంద్రబాబు ఎంతగా దిగజారవచ్చో అంతగా దిగజారిపోయారని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల సమయంలోను, ఎఫ్‌డిఐలపై పార్లమెంటులో ఓటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు కుమ్మక్కైపోవచ్చని అన్నారు.
మన రాష్ట్రంలో ఇప్పుడు దుర్మార్గపు, తుగ్లక్ పరిపాలన నడుస్తోందని దుయ్యబట్టారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి అస్సలు ప్రేమే లేదన్నారు. ఇంత ఘోరంగా కిరణ్ ప్రభుత్వ పాలన ఉన్నా, చంద్రబాబు నాయుడు కళ్ళప్పగించి చూస్తున్నారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలంతా కష్టాలు పడుతున్న ఈ సమయంలో చంద్రబాబు అసెంబ్లీకే రారట.. ప్రజల సమస్యలు పట్టించుకోరట అని ఆమె తప్పుపట్టారు. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నిస్సిగ్గుగా రక్షణ కవచంలా నిలిచి కాపాడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎవరి బాగు కోరుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీమతి షర్మిల నిలదీశారు. నిజానికి చంద్రబాబు పాదయాత్ర బండిని లాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీయే అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కైపోయి, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలులో పెట్టించాయని శ్రీమతి షర్మిల ఆరోపించారు. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. జగనన్న త్వరలోనే బయటికి వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని ఆమె భరోసా ఇచ్చారు. టిడిపి మట్టికొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని శ్రీమతి షర్మిల అన్నారు.
నల్లపాడు బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల గురువారం రాత్రికి బస చేసే ప్రాంతానికి చేరుకున్నారు. 90వ రోజు పాదయాత్రలో గురువారం 10.9 కిలో మీటర్ల దూరాన్నిశ్రీమతి షర్మిల నడిచారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇప్పటి వరకు మొత్తం 1239.4 కిలో మీటర్ల దూరాన్ని నడిచారు.
No comments:
Post a Comment