దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి@కాంగ్రెస్, టిడిపిలకు శ్రీమతి షర్మిల సవాల్

          'దమ్ముంటే జగనన్నను రాజకీయంగా ఎదుర్కోండి' అని కాంగ్రెస్‌, టిడిపిలకు శ్రీమతి షర్మిల సవాల్‌ చేశారు. అప్పుడు ప్రజా కోర్టులో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందని అన్నారు. స్థానిక ఎన్నికలను పార్టీ గుర్తుల ప్రాతిపదికన నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాజన్న రాజ్యానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలకాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తమకు జగమంత కుటుంబాన్ని ఇచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. జననేత జగనన్న తనకు స్ఫూర్తి అని శ్రీమతి షర్మిల అన్నారు. మహానేత వైయస్‌లానే జగనన్న కూడా తన జీవితాన్ని రాష్ట్ర ప్రజల సేవకు అంకితం చేశారన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగసభలో శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ సభకు ‌అత్యధిక సంఖ్యలో వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని.. రాజన్న రాజ్యం స్థాపిస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. జగనన్న జైలు నుంచి బయటికి వచ్చాకే మనకు అసలైన పండుగ అన్నారు. రాజన్నరాజ్యం తెచ్చుకున్నాకే మనకు నిజమైన పండుగ వచ్చినట్లు అన్నారు.

చదువులు ఆగిపోకూడదని, ఉన్నత చదువులు చదవాలని రాజన్నలక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. పేదలకు కూడా పెద్దాస్పత్రులలో ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశారన్నారు. 108, 104 లాంటి సేవలను ఆయనే అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. రాజన్న బ్రతికి ఉన్నప్పుడు రైతులు, మహిళలు సురక్షితంగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు అప్పులు తీర్చేందుకు రైతులు ఇంటిలోని వస్తువులు, నగలు, చివరికి ఒంటిలోని కిడ్నీలకు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. పక్కా ఇళ్ళకు ఈ ప్రభుత్వం పాడె కట్టిందని దుయ్యబట్టారు. చేనేతను చిదిమేసిందని విచారం వ్యక్తంచేశారు. రైతన్న, కూలన్న, మహిళలు, మైనార్టీలు, చేనేతన్నల కష్టాలన్నా తీరే రోజు త్వరలోనే వస్తుందని ధీమా కల్పించేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు శ్రీమతి షర్మిల చెప్పారు.

గతంలో మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులే ఇప్పుడూ రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. ఆయన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే తన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని చేస్తున్న పాదయాత్ర తనది అన్నారు. రికార్డుల కోసం చేస్తున్నది కాదని శ్రీమతి షర్మిల వివరించారు. ప్రజలపై కిరణ్‌ ప్రభుత్వం పగబట్టిందని చెప్పేందుకు చేస్తున్న పాదయాత్ర అని తెలిపారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం నిస్సిగ్గుగా రక్షణ కవచంలా నిలిచిందని వివరించేందుకు తాను ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందనే పనిని మాత్రమే రాజన్న చేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. అలాంటి నాయకుడి పేరును ఇప్పటి ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజీవ్‌ గాంధీ మరణించడంతో బోఫోర్సు కేసు నుంచి ఆయన పేరును తొలగించిన వైనాన్ని ప్రస్తావించారు. అలాంటిది మరణించిన వైయస్‌ సమాధానం చెప్పుకోలేరని తెలిసినా దుర్మార్గంగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. మహానేత రాజన్న మూడున్నరేళ్ళ క్రితం మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తరువాత అనాథ అయింది కేవలం తమ ఒక్క కుటుంబమే కాదన్నారు. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఆయన మరణంతో ఆవేదన చెందుతున్నాయన్నారు.


చంద్రబాబు పాలన ఒక చీకటి అధ్యాయం అని శ్రీమతి షర్మిల అభివర్ణించారు. తన మీద ఉన్న కేసులపై విచారణ జరగకుండా చూసుకునేందుకే చంద్రబాబు చీకటిలో చిదంబరాన్ని కలిసి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఒకరు మామకు వెన్నుపోటు పొడిచి, మరొకరు ఢిల్లీ సీల్డు కవర్‌ ద్వారా సిఎంలు అయ్యారని, వారికి ప్రజల కష్టాలు ఏ విధంగా తెలుస్తాయని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరతాయని ఆమె చెప్పారు. అత్యంత విలువైన ఐఎంజి భూములను తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేసిన చంద్రబాబుపై విచారణ చేయడానికి సిబ్బంది లేరని తప్పించుకున్న సిబిఐ తీరును శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. అదే జగనన్న విషయం వచ్చేసరికి ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్న సిబిఐ పక్షపాత ధోరణిని ఆమె ప్రశ్నించారు.

సిబిఐని వాడుకుని జగనన్నను పది నెలలుగా అక్రమంగా జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. శనివారంనాడు రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారు కె.వి.పి. రామచంద్రరావును విచారించిన తరువాత సిబిఐ జె.డి. చెప్పిన మాటలు ఎంత బాధ్యతా రహితంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. జగనన్న కేసు విషయంలో చార్జీషీట్‌ ఎప్పుడు వేసేది చెప్పలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్‌ వేయమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్న ఆదేశాలను కూడా సిబిఐ ధిక్కరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబిఐ దర్యాప్తునకు జగనన్న పూర్తిగా సహకరించినా ఇంత కక్షపూరితంగా ఎలా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.

కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు ఉచ్ఛనీచాలు లేవని, పాపభీతి లేదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. జగనన్నకు చేస్తున్న ద్రోహం వీళ్ళను ఊరికే వదిలిపెట్టదని అన్నారు. జగనన్నకు అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ శిశుపాలుడి మాదిరిగా శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. జగనన్న నిర్దోషి అని ప్రజలే తమ తీర్పు ద్వారా వెల్లడించాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

శ్రీమతి షర్మిల మాట్లాడిన ప్రతి మాటకూ సభకు హాజరైన అశేష జనవాహిని నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆమె చెప్పిన ప్రతి అంశానికి తమ ఆమోదాన్ని ప్రజలు ప్రకటించారు. ఈ బహిరంగ సభకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై సంఘాభావం ప్రకటించారు
Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.