విద్యుత్ చార్జీల పెంపు 116 శాతం! ఈఆర్‌సీకి సర్కారు ప్రతిపాదనలు

* టారిఫ్ పెంపు, టెలిస్కోపిక్ విధానం ఎత్తివేతతో పెనుభారం
* వినియోగదారుల్లో మెజారిటీ తక్కువ విద్యుత్
* ఉపయోగించే పేద, మధ్యతరగతి వర్గాలే
* ధనికవర్గాలకు కేవలం 37 శాతమే పెరుగుదలపై విస్మయం
* శాస్త్రీయత లోపించిందంటున్న నిపుణులు
* 2013-14 విద్యుత్ చార్జీలపై నేటి నుంచి విచారణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగించే వర్గాలైనప్పటికీ.. ఎక్కువసంఖ్యలో ఉండే వీరిపై పెనుభారం మోపడం ద్వారా ఆశించిన మేరకు రాబట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నెలకు 300 యూనిట్లలోపు వినియోగించే పేద, మధ్యతరగతి వర్గాలకు ఏకంగా 116 శాతానికి పైగా విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. 500 యూనిట్లకుపైగా వినియోగించే తక్కువ ‘పెద్దలకు’ మాత్రం కేవలం 37% మాత్రమే చార్జీల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. 

2013-14 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏప్రిల్ 1 నుంచి ఏకంగా రూ.12,723 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై మంగళవారం నుంచి బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. పేదలపై భారం మోపే ఈ ప్రతిపాదనలను తిరస్కరించాలని విద్యుత్‌రంగ నిపుణులు ఈఆర్‌సీని కోరుతున్నారు. 

ఇటు పెంపు.. అటు టెలిస్కోపిక్ విధానం ఎత్తివేత
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు హేతుబద్ధంగా లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టారిఫ్ పెంపు, కొత్త ప్రతిపాదనల్లో భాగంగా గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలపై ఎక్కువ భారం పడుతోంది. ప్రస్తుతం 101 యూనిట్లు వినియోగించే వారికి నెల బిల్లు రూ.263.60 వస్తుండగా, తాజా పెంపుదల వల్ల (యూనిట్‌కు రూ.5.65 చొప్పున) రూ.570.65 రానుంది. అంటే ఏకంగా 116.48% మేరకు విద్యుత్ చార్జీలు పెరగనున్నాయన్నమాట.


                     
అయితే నెలకు 501 యూనిట్లు వినియోగించే ధనికవర్గాలకు మాత్రం ప్రస్తుత బిల్లు రూ.2,552.25 వస్తుండగా, తాజా పెంపు ప్రతిపాదనల వల్ల రూ.3,507 రానుంది. అంటే వీరికి పెరుగుదల శాతం కేవలం 37.42% మాత్రమేనన్నమాట. వాస్తవానికి 200 యూనిట్లలోపు కేటగిరీలోని వినియోగదారుల విద్యుత్ వాడకం రోజురోజుకీ తగ్గుతోంది. 2011-12తో పోలిస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వీరి విద్యుత్ వినియోగం సుమారు 15% వరకూ తగ్గింది. ఇందుకు కారణం భారీగా విద్యుత్ కోతలు అమలు జరుగుతుండడమే. 

ఈ కేటగిరీలోని పేద, మధ్యతరగతి వినియోగదారులు ప్రధానంగా గ్రామీణ, మండల కేంద్రాల్లో నివసిస్తున్నవారే. గ్రామీణ, మండల కేంద్రాల్లో భారీగా విద్యుత్ కోతలు అమలు జరుగుతున్నాయి. ఫలితంగా వీరి వాడకం తగ్గుతోంది. ఇక 500 యూనిట్లపైన వాడకందార్ల వినియోగం మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది. తద్వారా వీరి అవసరాలను తీర్చేందుకే మార్కెట్లో ఏకంగా 5-6 రూపాయలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. సంబంధిత విద్యుత్ కొనుగోలు భారాన్ని వీరిపై వేయడమే సమంజసం. అలాకాకుండా పేద, మధ్యతరగతి ప్రజలపై వేయడం సరికాదని విద్యుత్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

పెద్దలకే పెంచాలి: టీజాక్ కో-ఆర్డినేటర్ రఘు
విద్యుత్‌ను దుబారాగా వినియోగిస్తున్న పెద్దలకు మాత్రమే చార్జీలను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చార్జీలను ఈఆర్‌సీకి సూచిస్తున్నట్టు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (టీజాక్) కో-ఆర్డినేటర్ రఘు ‘సాక్షి’కి తెలిపారు. ‘300 యూనిట్ల వరకు టెలిస్కోపిక్ విధానాన్ని ఉంచాలి. 500 యూనిట్లకుపైగా వినియోగించే వారికి టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయాలి. అదేవిధంగా ఈ కేటగిరీ వినియోగదారులకే చార్జీలను పెంచాలి. తద్వారా అధిక విద్యుత్ వాడకందార్లను నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల అదనపు విద్యుత్ కొనుగోలు భారం కూడా తగ్గుతుంది’ అని ఆయన వివరించారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు జరిగే బహిరంగ విచారణలో ఈ విషయాన్ని ఈఆర్‌సీ దృష్టికి తేనున్నట్టు ఆయన చెప్పారు. 

టెలిస్కోపిక్ విధానం అంటే
ప్రస్తుతం గృహ వినియోగదారులకు టెలిస్కోపిక్ విద్యుత్ చార్జీల విధానం అమలవుతోంది. ఈ విధానంలో ఎంత విద్యుత్ వినియోగించినప్పటికీ శ్లాబు వారీగా యూనిట్ చార్జీలను వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు 201 యూనిట్లు వినియోగించాడనుకుంటే.. మొదటి 100 యూనిట్లకు రూ.2.60, 101-200 యూనిట్లకు రూ.3.60, 201వ యూనిట్‌కు రూ.5.75 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం ఎత్తివేయడం వల్ల ఎన్ని యూనిట్లు వినియోగిస్తే అన్ని యూనిట్లకూ (ప్రతి యూనిట్‌కు) ఆ శ్లాబుకు సంబంధించిన విద్యుత్ చార్జీని వసూలు చేస్తారు. నాన్-టెలిస్కోపిక్ విధానంలో నెలకు 201 యూనిట్లు వినియోగించిన వ్యక్తి నుంచి మొత్తం అన్ని యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.6.15 చొప్పున వసూలు చేస్తారన్నమాట. 

విచారణ ఎప్పుడు.. ఎక్కడ
కొత్త విద్యుత్ చార్జీలపై ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో విచారణ జరగనుంది. ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే విచారణ మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరగనుంది. భోజన విరామం అనంతరం తిరిగి రెండున్నర గంటల నుంచి 5 వరకూ జరుగుతుంది. 19న విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియం, 21న విశాఖపట్నం మహారాణి పేటలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం ఫంక్షన్ హాల్, 23న వరంగల్ జిల్లా ప్రజా పరిషత్‌హాల్ (హన్మకొండ), 25న హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సియా ఆడిటోరియంలో విచారణ జరగనుంది.

వచ్చే 3 నెలలూ నరకమే!
రానున్న మూడు నెలల్లో అనధికారికంగా భారీగా విద్యుత్ కోతలు అమలు చేయాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాలతో పాటు జంటనగరాల్లో కూడా భారీగా కోతలు తప్పవని అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో సీఎండీ హీరాలాల్ సమారియా నేతృత్వంలో అన్ని డిస్కంల సీఎండీల సమావేశం సోమవారం జరిగింది. ఈ భేటీలో భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్, సరఫరా, లోటు వివరాలను అంచనా వేశారు. మార్చి సగటు లోటు ఏకంగా 94 ఎంయూలకు చేరనుందని లెక్కగట్టారు. 

ఈ నేపథ్యంలో భారీ కోతలు అమలు చేయకతప్పదనే భావన వ్యక్తమైంది. వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ సరఫరా కూడా కష్టమనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఒక ఎకరం పంట కూడా ఎండకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సమారియా ఆదేశించారు. పరీక్షల వేళల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన, గాయపడ్డ వారికి నష్టపరిహారం పెంపుదలపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.